పంచాయతీ ఎన్నికల్లో కుప్పం ఫలితాలు టీడీపీని కాస్త టెన్షన్ పెట్టాయి. పార్టీ అధినేత ఇలాకాలో వైసీపీ ఏకపక్ష విజయాలు తెలుగు తమ్ముళ్లను పరేషాన్ చేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం గందరగోళంగా మారి రాజీనామాల వరకు వెళ్లాయి. ఇలాంటి సమయంలో కుప్పం పర్యటనకు సిద్ధమయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు. కుప్పంలో జరిగిన డ్యామేజ్ ని చంద్రబాబు ఎలా సరిచేస్తారు ఇప్పటికిప్పుడు ఈ పర్యటన వెనుకున్న కారణాల పై తెలుగు తమ్ముళ్లలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
చంద్రబాబు..కుప్పం. ఈ రెండు పేర్లకు బలమైన బంధం ఏర్పడి దశాబ్దాలవుతోంది. వైఎస్ కుంటుంబానికి పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం అలాగ అని భావిస్తారు జనం. టీడీపీ బాస్ హైదరాబాద్‌లో ఉన్నా.. అమరావతిలో ఉంటున్నా..దూరం నుంచే కనుసైగతో కుప్పంను శాసిస్తారని.. అక్కడ ఆయన మాటే వేదం.. శాసనమని జనం అనుకునేవారు. అలాంటిది 2019 ఎన్నికల నుంచి అక్కడ పసుపు మబ్బులు తేలికపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ఓట్లు లెక్కిస్తుండగా.. మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనకబడటం.. చివరకు ఆధిక్యం తగ్గించడంలో వైసీపీ సక్సెస్ అయింది.
ఇక చివరికి విజయం వరించినా అది అత్తెసరు మెజార్టీనే. ఇంకాస్త ఎఫర్ట్ పెడితే ఆయన ఓడిపోయేవారనేది వైసీపీ నేతలు చెప్పే మాట. అప్పటి నుంచి స్పెషల్ ఎఫెర్ట్ పెట్టిన అధికార వైసీపీ పంచాయతీ ఎన్నికల నాటికి వ్యూహం మార్చేసింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి పదమూడే దక్కాయి. ఈ ఫిగర్ చూసిన తర్వాత టీడీపీ శిబిరంలో కలకలం మొదలైంది. కుప్పంలో ఏం జరుగుతుందా ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయంగా వస్తుంది. అయితే ఈ కోటకు బీటలు వేయాడమే లక్ష్యంగా వైసీపీ రచించిన వ్యూహం టీడీపీ శ్రేణులనే కాదు.. అధినేతకు మైండ్ బ్లాంక్ చేసినంత పని చేసింది. ఊహకు అందని విధంగా వైసీపీ కుప్పంలో పుంజుకుందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు పంచాయతీ ఫలితాలు చూసిన తర్వాత వెంటనే కుప్పం వెళ్లాలని డేట్స్ ఫిక్స్ చేసుకున్నారట చంద్రబాబు. ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజులపాటు కుప్పంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు.
గత 35 ఏళ్లుగా రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అని చంద్రబాబు ఆరా తీస్తే.. కుప్పం టీడీపీ నేతల నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. అందుకే ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నిర్ణయించారని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చంద్రబాబు పర్యటనపై ఇటు తెలుగు తమ్ముళ్లతోపాటు వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొంత వాకబు చేసిన పార్టీ అధినేత.. నేరుగా కార్యకర్తలతో సమావేశమై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుప్పం వచ్చిన చంద్రబాబుకు మెజారిటీ తగ్గడానికి స్థానిక నేతలే కారణమని శ్రేణులు ఫిర్యాదు చేశాయి. చంద్రబాబు పీఏ మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులపై పార్టీ కేడర్ సైతం గుర్రుగా ఉందట. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని.. పైగా పనులు చేయడానికి లంచాలు తీసుకున్నారని ఆరోపించారట. అప్పట్లో కేడర్ మాటలకు బాబు అడ్డుచెప్పినా.. మేం చెప్పేదే మీరు వినాలని గట్టిగానే కోరారట తమ్ముళ్లు. కానీ పెద్దాయన దగ్గర నుంచి ఆశించిన రెస్పాన్స్ లేదనే అసంతృప్తి వారిలో ఉండిపోయిందట. అందువల్లే పంచాయతీ ఎన్నికల్లో షాక్ ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు పంచాయతీ ఎన్నికల తర్వాత వస్తున్న చంద్రబాబుకు మరోసారి కేడరే క్లాస్ తీసుకుంటుందా అన్న చర్చ నడుస్తుంది. ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోండి.. మా సమస్యలు పరిష్కరించండి.. లేదంటే మా దారి మాదే అని స్పష్టం చేయడానికి కొందరు సిద్ధ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలో బాబు రాక సందస్భంగా తమ్ముళ్లు ఏర్పాటు చేసిన సమావేశం రచ్చ రచ్చగా ముగిసింది. మీది తప్పంటే మీది తప్పంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేడర్. దీంతో మనోహర్, శ్రీనివాసులు, ఇంఛార్జ్ మునిరత్నం రాజీనామా చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది.