- ఢిల్లీలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు?
- అమరావతిపై జగన్‌ది కేవలం విషప్రచారమే తప్ప విషయం లేదు
- టీడీపీ నేత నారా లోకేశ్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు? అంటూ ప్రశ్నించారు. సీఎం రాష్ట్ర ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఆయనపై ఉన్న 31 కేసుల విచారణ జాప్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
అలాగే, మూడు రాజధానుల పేరుతో అమరావతిని అంతం చేయడానికి ఢిల్లీ పర్యటన అంటూ ఆరోపించారు. 151 దేవాలయాలపై జగన్ రెడ్డి చేసిన దండయాత్రల ఆధారాలు బయటపెట్టకుండా ఉండటానికే నంటూ విమర్శించారు. ఇక జై అమరావతి ఉద్యమంపై ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. జై అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరిన సందర్భంగా ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అని నినదిస్తూ రైతులు, మహిళలు, యువత ఆదర్శంగా నిలిచారు అంటూ పేర్కొన్నారు.
అలాగే, అమరావతిపై సీఎం జగన్ రెడ్డిది కేవలం విష ప్రచారమే తప్ప విషయం లేదని తెలిపోయిందని విమర్శించారు. అంతిమ విజయం రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులదే అంటూ పేర్కొన్నారు. ఫేక్ మద్యం అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంపై లేదనీ, ఏలూరులో అంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.