ఐదు జిల్లాల్లో టీడీపీ ఖాళీ… కిం క‌ర్త‌వ్యం…!

-

రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎదురైన పరాజ‌యం ఇంకా ప‌ట్టిపీడిస్తూనే ఉంది. ఎన్నిక‌ల్లో స‌రైన వ్యూహంతో ముందుకు సాగ‌లేద‌నే అసంతృప్తితోపాటు.. చంద్ర‌బాబు అనుస‌రించిన విధానంపైనా.. త‌మ్ముళ్ల‌లో ఆగ్ర‌హం చ‌ల్లార‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ ప‌రిస్థితి దిన‌దిన గండంగా మారిపోయింది. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విశాఖ‌ప‌ట్నం, త‌న సొంత జిల్లా చిత్తూరులోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇలా .. మొత్తం.. ఐదు జిల్లాల్లో పార్టీ పేల‌వ‌మైన ఎఫ‌ర్ట్ ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విశాఖ‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. అయితే, ఈ ఉత్సాహం.. ఈ ఆనందం.. పార్టీకి ఏడాది కూడా నిల‌వ‌లేదు. ఇటీవ‌లే ద‌క్షిణం ఎమ్మెల్యే పార్టీకి రాం రాం చెప్పారు. ఇక‌, ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వర్గంగా ఉన్న మ‌రికొంద‌రు కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇప్పుడు విశాఖ సిటీ స‌హా గ్రేట‌ర్ విశాఖ‌లో టీడీపీ జెండా మోసే నాయ‌కులు లేకుండా పోయార‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, క‌డ‌ప‌లో పూర్తిగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. ఇక్క‌డ అక్క‌ర‌కు వ‌స్తార‌నుకున్న సీనియ‌ర్లు పార్టీ మారిపోయారు.

క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. కేఈ, కోట్ల కుటుంబాల‌ను గ‌త ఏడాది ఎన్నిక‌లకు ముందు క‌లిపినా.. త‌ర్వాత మాత్రం విడిపోయారు. పైగా పార్టీ మారేందుకు కోట్ల కుటుంబం రెడీగా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. భూమా అఖిల ప్రియ దూకుడును ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. టీజీ వెంక‌టేష్ ఉన్న‌ప్ప‌టికీ.. మౌనంగానే ఉంటున్నారు. పాణ్యంలో కొత్త‌గా చేసిన గౌరు చ‌రితా రెడ్డివంటి వారు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరాల‌ని భావిస్తున్నారు. దీంతో క‌ర్నూలులో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోనూ పార్టీని ప‌ట్టించుకునే వారు కరువ‌య్యారు. ప్ర‌కాశంలో ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.

ద‌ర్శిలో మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు పార్టీ మారారు. చీరాల‌లో గెలిచిన సీనియ‌ర్ క‌ర‌ణం బ‌ల‌రాం కూడా పార్టీకి దూర‌మ‌య్యారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీమార‌లేదు.. కానీ, మారే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, ఒంగోలులో గ‌త ఐదేళ్లు దూకుడు ప్ర‌ద‌ర్శించిన దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌.. ఇప్పుడు స‌ర్దుకు పోతున్నారు. దీంతో ఇక్క‌డ కూడా పార్టీ ప‌రిస్తితి కుడితిలో ప‌డ్డ ఎలుక మాదిరిగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా జిల్లాల వారీగా దృష్టి పెట్టాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి.

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news