వరదలో వైసీపీ, టీడీపీ బురద రాజకీయం… ఎవరి దారి వారిదే…!

-

ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఏపీలో మాత్రం రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది. ప్రస్తుతం వరదలు వచ్చి ఏపీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న కూడా వైసీపీ, టీడీపీ నేతలు మాత్రం అదే వరదలో బురద రాజకీయం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఏపీని వరదలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదల వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల పంటలు మునిగిపోయాయి. రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇళ్ళలో నదులు ప్రవహిస్తున్నట్లు పరిస్తితి ఉంది. పలుచోట్ల పేదల ఇళ్ళు కుప్పకూలి, పలువురు మృతి చెందారు.

అయితే ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ, టీడీపీ నేతలు మాత్రం దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం ప్రజలు వర్షాల వల్ల ఇబ్బంది పడుతుంటే, వైసీపీ నేతలు మాత్రం అమరావతి మీద ఫోకస్ చేసి రాజకీయం చేస్తున్నారు. అబ్బో అమరావతి మునిగిపోయిందని, రోడ్ల మీద చేపలు పట్టుకోవచ్చు అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అటు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోతుందని హడావిడి చేశారు.

వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని పట్టుకుని కొందరు వైసీపీ ముఖ్య నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతికి పెద్దగా వరద ముంపు లేదు. అమరావతిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలే ఫేక్ ఫోటోలు పెట్టి ప్రచారం చేశారు. ఇటు టీడీపీ వాళ్ళు కూడా తగ్గకుండా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు మునిగిపోయాయని చెబుతూ,వాటిల్లోకి వెళ్ళి మునగడం, అలాగే రోడ్లు మీద గుంటల్లో చేపలు పట్టడం చేస్తున్నారు.

ఇప్పటికిప్పుడు ఇళ్ల స్థలాలు మునగడం వల్ల ఎవరికి ప్రమాదం లేదు. తర్వాత మెరక బట్టి ఇబ్బంది ఉండదు. అలాగే రోడ్లు మీద చేపలు పట్టే బదులు ఆ గుంటలని ఏదొరకంగా పూడిస్తే బాగుండేది. ఇక మన బాబు గారైతే హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ వరదలపై జగన్‌కు లేఖలు రాస్తున్నారు. ప్రతిపక్ష నేత అయి ఉండి ఫీల్డ్‌లో దిగి ప్రజలకు అండగా ఉండకుండా, ఇంట్లో కూర్చుని ప్రేమ లేఖలు రాస్తున్నారు. మొత్తానికైతే రెండు పార్టీలు వరదలో బురద రాజకీయమే చేశారు.

– vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Latest news