రాజకీయాల్లో ఏం జరిగినా సంచలనమే. ఒక పార్టీ నేతలు.. మరోపార్టీ నేతలను విమర్శించినా… కలిసి మాట్లాడినా.. లేక, దూరంగా ఉన్నామని ప్రకటించినా.. ఏదైనా వార్తగానే మారిపోయి.. వైరల్ అయిపోతున్న రోజులివి..! ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ కేంద్రంలోని బీజేపీ పట్ల వ్యవహరించిన తీరు కూడా సంచలనానికి వేదికగా మారింది. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా, పోలవరం నిధులు ఇవ్వడం లేదని పేర్కొంటూ… తీవ్రస్థాయిలో అదే పార్టీతో వివాదం పెట్టుకుని దూరమైంది.
అయితే, ఎన్నికల్లో ఓటమి చెందడం, కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావడంతో.. మరోసారి ఆ పార్టీకి చేరువయ్యేందుకు బాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయిన దానికి కాని దానికి కూడా కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని చెబుతూ వస్తున్నారు. పైగా రాజధాని అమరావతిని తరలిస్తామని జగన్ చెప్పినప్పుడు స్వయంగా చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాశారు. అమరావతిని మీరు రక్షించాలని కోరారు.
ఏపీలోనూ బీజేపీ నేతలపై ఆయన దూకుడుగా వెళ్లడం లేదు. అవకాశం ఇస్తే.. మళ్లీ కమలంతో చేతులు కలుపుతామనే సంకేతాలను పదేపదే పంపుతున్నారు. దీంతో అందరూ కూడా మరోసారి బాబు-బీజేపీ కలిసిపోవడం ఖాయమని, అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మున్ముందు వీరి మైత్రి రాజిల్లుతుందని చెబుతూ వస్తున్నారు. అయితే, ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ, బీజేపీకి అనుకూలంగా వుంటూ వస్తున్న టీడీపీ.. తాజాగా వ్యవసాయ బిల్లుపై మాత్రం ముఖం చాటేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చిన ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా టీడీపీ నేతలు డుమ్మా కొట్టారు. అంతేకాదు, ఇది రైతులకు శాపమని ఆ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం టీడీపీలో చర్చకు వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash