సిక్కోలు లోని ఆ నియోజకవర్గం పై టీడీపీ స్పెషల్ ఫోకస్

-

కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అక్కడ రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది . ఇప్పటికే మంత్రి వర్సెస్ ఎంపీల మధ్య మాటల మంటలు అక్కడ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి . ఇదిలా ఉంటే ఓ వైపు భూ ఆక్రమణల పై సవాళ్ల పర్వం నడుస్తుండగానే ..ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి తెస్తున్నారట . మొన్నటి ఎన్నికల్లో కానీ..గడచిన ఏడాదిన్నర కాలంలో కానీ రాని కుల ప్రస్తావన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందట. మరో వైపు ఈ నియోజకవర్గం పై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట…

సిక్కోలు ఆర్ధికరాజధాని పలాసలో ఇప్పుడు రాజకీయం రంజుగా మారుతోందట .మంత్రి డా.సీదిరి అప్పలరాజు కనుసన్నల్లోనే పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పలాసలో పెట్టిన ఓ రేంజ్ లో రచ్చచేసింది . ప్రతిపక్షాల విమర్శలకు తాను కూడా ఎక్కడా తగ్గేది లేంటూ మంత్రి అప్పలరాజు సైతం రివర్స్ కౌంటర్ గట్టిగానే ఇచ్చారు . ఇలా మంత్రి వర్సెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధం పలాస నుంచి జిల్లా కేంద్రం వరకూ జోరుగా చర్చకు తావిచ్చిందట. పలాస – కాశీబుగ్గ జంటపట్టణాల పరిధిలోని పురుషోత్తపురం రెవిన్యూ విలేజ్ లో గత కొంత కాలంగా యదేచ్ఛగా భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ముఖ్యంగా సూదికొండ ,నెమలికొండ , ఎర్రచెరువు , సూర్యకాలనీ వంటి ప్రాంతాల్లో కొండలు ,గుట్టలు , పంటకాలువలు , చెరువులు అని తేడా లేకుండా కబ్జారాయుళ్లు జెండాలు పాతేశారు.

గడిచిన ఏడాదిన్నర కాలంగా స్తబ్ధుగా ఉన్న పలాస టీడీపీ నేతలకు బూస్టింగ్ ఇచ్చేందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగి మంత్రి అప్పలరాజుతో కయ్యం పెట్టుకోవడం పలాసలో చర్చనీయాంశంగా మారిందట . అదే సమయంలో ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలను,పార్టీని పట్టించుకోని టీడీపీ ఇంఛార్జ్ గౌతు శిరీష కూడా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట. ఐతే ఇంతవరకూ బాగానే ఉంది కానీ..పలాసలో ప్రెస్ మీట్ పెట్టిమరీ మంత్రి ఇచ్చిన వార్నింగ్ టీడీపీ నేతలకు , క్యాడర్ కు ఎక్కడో కాలేలా చేసిందట. రాజకీయంగా విమర్శలను పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలు కులం రంగు పులుముకున్నాయట . దీంతో ఇప్పుడు మంత్రి వర్సెస్ ఎంపీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం మధ్యలోకి గౌతు శిరీష ఎంటరయ్యారు.

స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న మనుమరాలైన శిరీష ఇంటి పేరు కూడా గౌతు కావడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆమె ఇంటిపేరు , కులం గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారట . ఈమెది వేరే కులం…ఆమె భర్తది వేరే కులం అలాంటప్పుడు ఈమె గౌతు వారసురాలు ఎలా అవుతుందంటూ కులాన్ని బయటకు లాగుతున్నారట . ఐతే సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఈరచ్చకు గౌతు శిరీష తనదైన శైలిలో ఇదంతా మంత్రి అప్పలరాజు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారంట…స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు వార్ వన్ సైడ్ కాదు..నేనూ మాటలయుద్ధానికి రెఢీ అనే సంకేతాలు ఇస్తున్నారట .

నా తాత , నాతండ్రి , నా భర్త , నా బంధువులు అంటూ అందరూ ఎవరెవరు ఏ ప్రాంతానికి చెందినవారో చెబుతూ గట్టిగానే సమాధానమిచ్చారట . ఇదే సమయంలో తన కులం , కుటుంబం గురించి మాట్లాడితే మంత్రి కులం ,ఆయన భార్య కులం గురించి కూడా మేం బయటికి తీసుకొస్తామంటూ..అన్నంత పనీ చేశారట. మంత్రి అప్పలరాజు మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా..ఆయన సతీమణి ..శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన సమాజికవర్గమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన వారు .ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా మార్చుకుని మంత్రి పై శిరీష విమర్శలు గుప్పిస్తున్నారట.

ఐతే గడచిన మూడు నాలుగు దశాబ్ధాలుగా ఉద్ధానం పరిధిలో మత్స్యకార,కాళింగ సామాజిక వర్గాల అండతోనే గౌతు కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది . ఇప్పుడు ఈ సామాజికవర్గాలను వారికి దూరం చేసేందుకే వైసీపీ కులరాజకీయాలకు తెరతీసిందని టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోందట . ఇప్పటికే మత్స్యకార సామాజికవర్గంలో కొందరిని తమ వైపు తిప్పుకునేలా టీడీపీ సక్సెస్ అయ్యిందట. అదే సమయంలో పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని కాళింగ సామాజికవర్గం,వ్యాపార వర్గాలకు చెందిన వైశ్య సామాజికవర్గాలను కూడా మంత్రికి దూరం చేసేందుకు టీడీపీ వేగంగా పావులు కదుపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news