బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభకు అంతరాయం కలిగిస్తున్నారంటూ… బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ లను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు న్యాయపోరాటం చేస్తున్నారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేసినట్లు హైకోర్ట్ ను ఆశ్రయించారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం ఈ కేసుపై హైకోర్ట్ లో విచారణ జరగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు పంపింది. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకపోవడంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా సీపీ, రిజిస్ట్రార్ జనరల్ వెళ్లి నోటీసులు అందించాలని ఆదేశించింది. కేసు విచారణను ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
తాము తమ స్థానంలో ఉండి నిరసన తెలపడాన్ని కూడా ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని.. బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నిరసన తెలిపే తమ హక్కును టీఆర్ఎస్ అణచివేస్తోందని వారు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను చూసి ప్రభుత్వం భయపడుతుందని ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై కోర్ట్ ఎటువంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాలి.