తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రెండు లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలను పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. కొన్ని రకాల చికిత్సల కోసం అవసరమైతే 10 లక్షల రూపాయలు కూడా ఈ పథకం కింద ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన వెల్లడించారు..
గుండె, లివర్ అలాగే బోన్ మార్ లాంటి అవయవ మార్పిడి చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇందుకు గాను ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలను వినియోగించుకునే వెసులుబాటు రోగులకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచడం కారణంగా పేదలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణాంతక వ్యాధుల నుంచి చికిత్స తీసుకునే వెసులుబాటు దక్కుతుందని ఆయన చెప్పారు.