తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంపై ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు ప్రస్తావించలేదని.. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాలు పేర్కొనలేదా.. లేక గవర్నర్ తొలగించారా అని ప్రశ్నించారు.
ప్రొరోగ్ చేయకుండానే సమావేశాల నోటిఫికేషన్ ఇచ్చారని.. అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా అని అడిగారు. ఆమోదిస్తే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేబినెట్ కూడా చర్చించలేదా? అని అన్నారు. ‘గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు మెరుగుపడడం మంచిదే. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలు పేర్కొనలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. కేంద్రం అన్యాయం చేస్తోందని సీఎం బయట చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలు ఎందుకు లేవు?’ అని అక్బరుద్దీన్ అన్నారు.