తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు, సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించారు. పలు గుణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం దళిత బంధు పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టసవరణ బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 5మంది కో-ఆప్షన్ సభ్యులు ఉండగా.. ఆ సంఖ్యను 15కు పెంచారు. ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10 వరకు కో-ఆప్షన్ సభ్యులను పెంచాలని తీర్మానించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అటవీ విశ్వవిద్యాలయంలో కొత్త పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి సాగు నీటి కోసం అదనంగా 33టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకోసం రూ.2,200 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం కోసం 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. భద్రాచలం ముంపు ప్రాంతాల్లోని మొత్తం 2,016 కుటుంబాలకు నూతనంగా కాలనీలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.