గోల్ మాల్ ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అక్రమాలు చేస్తోంది, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతోంది బీజేపీ నాయకులేనని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ అక్కడి నూతన కలెక్టరేట్ సమీకృత భవనాలను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
“మోసపోతే గోసపడతాం.. గుజరాత్ గులాంలా బూట్లు మోసే సన్నాసులు మన దగ్గర ఉన్నారు. ఆ చెప్పులే మోసేవాళ్లు దుర్మార్గులు. వాళ్లే ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీళ్లను వీలైనంత త్వరగా గద్దె దించకపోతే దేశాన్ని ఆగం ఆగం చేస్తారు. బీజేపీ ముక్త్ భారతదేశం కోసం అందరూ కదలాలి.” అని పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
“దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్ 20.8 శాతమే. సాగుకు వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు. కార్పొరేట్ దొంగలకు దోచినంత సొమ్ము కాదు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్ పెట్టాలి. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరారు. మీటర్లు లేని విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచి పెట్టారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావట్లేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలి. పెద్దపల్లిలోని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చాం. గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు అందజేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి మంజూరు చేస్తాం. మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు అందజేస్తామని” సీఎం కేసీఆర్ అన్నారు.