మునుగోడు ఉపఎన్నిక భాజపా కుట్ర : కేసీఆర్

-

మునుగోడు ఉపఎన్నికను అధికార తెరాస.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో జరగనున్న ఆ ఉపఎన్నికలో గులాబీ జెండా ఎగురేయాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన.. పార్టీ నేతలతో తెరాస అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు . గురువారం ప్రగతిభవన్‌లో గంటకుపైగా పలుఅంశాలపై చర్చించారు.

ఈనెల20న మునుగోడు నియోజకవర్గంలో.. బహిరంగసభ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మునుగోడు ప్రజాదీవెన పేరిట నిర్వహించే సభకు లక్ష మందిని తరలించాలని స్థానిక నేతలకు లక్ష్యం విధించారు. ఆ సభ విజయవంతం చేసేందుకు మండలాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. మునుగోడు ఉపఎన్నిక భాజపా పన్నిన కుట్ర అని సీఎం అభివర్ణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో తనను అడ్డుకునే కుట్రలో భాగమే.. ఉపఎన్నిక అని కేసీఆర్ ఆరోపించినట్లు తెలుస్తుంది.

 మునుగోడు రాజకీయం క్షేత్రస్థాయికి చేరింది. అన్ని పార్టీలు ఉప ఎన్నికల పోరును కార్యక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. త్వరలోనే మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే అసమ్మతి నేతలతో చర్చించిన పార్టీ నేతలు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని తీర్మానించారు. అప్పటివరకు పార్టీయే అభ్యర్థిగా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేయాలని అధిష్ఠానం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news