హైదరాబాద్: దేశానికి అన్నం పెట్టే అన్నదాదలపై దేశ రాజధాని ఢిల్లీ నడిబోడ్డున్న దాడి జరగడం అమానుషమని మాల్కాజ్‌గిరి నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ మార్చ్ సందర్భంగా అన్నదాతలపై జరిగిన దాడులపై తాజాగా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశానికి అన్నం పెట్టే రైతులపై దాడి అమానుషం.. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే, నేడు రైతులపై జరిగిన దాడి మోడీ, అమిత్ షా జోడి పతనానికి నాంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం జరుగుతున్న వేళ దేశప్రజలకు అన్నం పెడుతూ వెన్నుకుదన్నుగా నిలుస్తున్న రైతన్నలపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. వివాదాస్పద ఆ కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అలాగే, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా రైతులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్న ఓ వీడియోను సైతం సోషల్ మీడియాలో ఆయన పంచుకున్నారు.