మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పదిహేను రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మునుగోడు ఉప ఎన్నిక కార్యాచరణే లక్ష్యంగా పీసీసీ గురువారం గాంధీభవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం చేస్తే గందరగోళం ఏర్పడుతుందనే అభిప్రాయం నేపథ్యంలో త్వరితగతిన అభ్యర్థి అంశంలో పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు.
అభ్యర్థుల ఖరారులో జాప్యం వల్ల హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందనే అంశాన్ని సమావేశంలో చర్చించారు. ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఒక దశ సర్వే పూర్తి చేసిందని, మరో సర్వేతో పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు పేర్కొన్నారు. మునుగోడులో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డాలని, మొదటి దశగా 75 రోజుల పాటు నియోజకవర్గంలో నిరంతరాయంగా కార్యక్రమాలను చేపట్టాలని తలపెట్టారు. పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 13న నారాయణ్‌పూర్ నుంచి చౌటుప్పల్ వరకు 13 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 16న నాంపల్లి, మర్రిగూడల్లో, 18న చండూరు, మునుగోడుల్లో, 19న నారాయణ్‌పూర్, చౌటుప్పల్‌లలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటుచేయాలని తీర్మానించారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా 20న మన మునుగోడు-మన కాంగ్రెస్ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సందర్భంగా 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించాలని ప్రణాళిక రూపొందించారు. పార్టీ కేడర్ బలంగా ఉన్న నేపథ్యంలో విజయానికి అవసరమైన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్ర పార్టీ నాయకత్వం పూర్తిగా ఈ ఎన్నికలోనే నిమగ్నం కావాలని అనుకున్నారు.
సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నేతలు మధుయాస్కీగౌడ్, బోసురాజు, నదీం జావెద్, మహేష్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, అనిల్, నల్గొండ, భువనగిరి జిల్లాల డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2023 ఎన్నికల్లో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు మునుగోడు విజయం దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు. ఎక్కువమంది ఓటర్లు ఉన్న సామాజిక వర్గాల బాధ్యతను రాష్ట్రపార్టీ నేతలకు అప్పగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంలోని సభ్యులు సమావేశంలో పాల్గొని సామాజిక మాధ్యమాలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాన్ని వివరించారు.