తెలంగాణలో తొలి అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని.. దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022కు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.
రాష్ట్ర అవసరాలు, జాతీయ విధానాలకు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్త్రాల్లో నూతన కోర్సులతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించారు. అటవీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. ఈ వర్సిటీకి తొలి వీసీని ఛాన్స్‌లర్ నియమిస్తారు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ద్వారా జరగనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై తొలుత మంగళవారం అసెంబ్లీలో, ఆ తర్వాత శాసనమండలిలో చర్చ జరగనుంది.