పొరుగు దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీపాక్స్ తాజాగా ఇండియాలోకి కూడా ప్రవేశించింది. అయితే.. దేశంలోనే తొలిసారి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మంకీపాక్స్‌ను ఎదుర్కోవడమెలా? ఎలాంటి రోగుల నుంచి శాంపిల్స్ సేకరించాలి? మంకీపాక్స్ సోకినట్టు ఎలా గుర్తించాలి? వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి? వంటి అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు శ్రీనివాసరావు.
ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండ్లకు పంపించారు శ్రీనివాసరావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ ఇప్పటికే 50 దేశాలకు విస్తరించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,413 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జంతువుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.