తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్న కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల వ్యవహారంలో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ భూముల వ్యవహారంలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు మాట్లాడుతూ.. ఒకే ఘటనపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేసి వైరల్ చేశారని.. సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. పోలీసుల విచారణకు సహకరించాలని క్రిశాంక్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.