నేడు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావు, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ నేపధ్యం లో మంత్రి హరీష్ మాట్లాడుతూ, రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల హాయంలో అనేక సమస్యలు ఉండేవని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక సమస్యలను సీఎం కేసీఆర్ తీర్చారని తెలియచేశారు. మహిళలకు గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు త్వరలోనే వడ్డీని జమ చేస్తామన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఇల్లు లేని పేద వారికి రూ.3 లక్షలు అందిస్తామని ఆయన వెల్లడించారు.
యువత కోసం త్వరలోనే స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ భవనాలు నిర్మించుకునేందుకు స్థలం కొరకు సర్వే మ్యాప్ తయారు చేసి జనాభా ప్రాతిపదికన అందించాలని, లేఅవుట్ తయారు చేసి ఇళ్లు లేని వారికి స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్. అంతకు ముందు మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్, సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.