రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను సజావుగా భర్తీ చేసేందుకే ఉమ్మడి నియామకాల బోర్డును ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళిసైకి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి తెలిపారు. సుదీర్ఘ అధ్యయనంతోపాటు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డుపై గవర్నర్‌కు ఉన్న సందేహాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి క్లియర్ చేశారు.బిహార్, ఝార్ఖండ్‌ల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారని వివరించారు. యూజీసీ నిబంధనల ప్రకారమే బోర్డు పనిచేస్తుందని అధ్యాపకుల ఎంపిక కమిటీల్లో ఉపకులపతులు ఛైర్మన్‌గా ఉంటారని మంత్రి తమిళిసైకి తెలిపారు. రాష్ట్రంలో వర్శిటీల అవసరాల దృష్ట్యా వెంటనే నియామకాలు చేపట్టేందుకుగానూ బిల్లుకు ఆమోదం తెలపాలని గవర్నర్‌ను కోరారు.
సత్వర నియామకాలే తన అభిమతమని గవర్నర్ తమిళిసై చెప్పారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రక్రియ సాగాలని సూచించారు. నియామకాలతోపాటు విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వసతి గృహాలు, ప్రయోగశాలలను మెరుగుపరచాలని తమిళిసై సూచించారు. గవర్నర్ సూచనలు పరిగణనలోనికి తీసుకున్నామని.. ఆమె బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే యుద్ధప్రాతిపదికన నియామకాలు చేపడతామని మంత్రి సబితారెడ్డి చెప్పారు.