త్వరలో… ముఖ్యమంత్రి కేటీఆర్..?

-

తెలంగాణ రాష్ట్రానికి అతిత్వరలో మూడవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖామంత్రి కె. తారకరామారావు పదవిని అధిష్టించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవిని తనయుడు కేటీఆర్కు కట్టబట్టాలని సీరియస్గా ఆలోచిస్తున్నట్లు ప్రగతిభవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. యూపీలోని ములాయం-అఖిలేష్ కాన్సెప్ట్నే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీకి గౌరవాధ్యక్షుడిగా ఉంటూ, ప్రభుత్వానికి పెద్దదిక్కుగా వ్యవహరించేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితులు కూడా టీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఏమీలేవు. ‘‘కేసీఆర్ ఒంటెద్దుపోకడలు ఎవరికీ నచ్చడంలేదు. ఎవరైనా మంచి చెబితే, వారిని వెంటనే దూరం పెట్టేస్తున్నాడు. మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలయినా, అధికారులైనా ఇదే పరిస్థితి. అందుకే ఎవరూ సాహసించడంలేదు’’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి చేటు తెస్తున్నాయని స్వయంగా కేటీఆర్ కూడా భావిస్తున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్కొక్కటిగా ఆయన చేస్తున్న తప్పులు కొండలా పేరుకుపోతున్నాయని టీఆరెస్ నేతలే వాపోతున్నారు. కొత్త సచివాలయ ప్రహసనం, కాళేశ్వరం వృధా పంపింగ్, చింతమడక ప్రజలకు తలా పదిలక్షలు, కృష్ణా-గోదావరి అనవసర అనుసంధానం లాంటి ఆలోచనలు ఎవరికీ మింగుడుపడడంలేదు. ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అన్న కామెంటే బీజెపీకి నాలుగు సీట్లిచ్చిందని టీఆరెస్ క్యాడర్ బలంగా నమ్ముతోంది. దాంతో మోదీ-అమిత్షాల ఏకాగ్రత అంతా ఇప్పుడు తెలంగాణపై పెట్టారని, యూపీఏ అధికారంలోకి వస్తుందన్న మూఢనమ్మకంతో చేపట్టిన కొన్ని చర్యలు కూడా వారిని టీఆరెస్కు దూరం చేసాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

పులి మీద పుట్రలా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు బలయ్యారు. రాష్ట్రమంతా రగిలిపోతోంది. ఎవరు, ఎప్పుడు ఎక్కడ సమ్మె చేసినా, కూర్చుని మాట్లాడుకుని ఎక్కడో ఒక దగ్గర రాజీకి వస్తారు. అన్ని డిమాండ్లు ఏ ప్రభుత్వం ఆమోదించదు. సంఘాలు కూడా ఆశించవు. విలీనం మినహా మిగతా వాటి గురించి ఆర్టీసీని స్వయంగా చర్చలకు పిలిస్తే బాగుండేది. సమస్య అక్కడే సగం పరిష్కారమయ్యేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. పార్టీలోని నిజమైన విధేయులు అందరూ అవేదన చెందుతున్నారు. బయటినుంచి వచ్చి, మంత్రి పదవులనుభవిస్తున్న వారు పేలుస్తున్న అవాకులు,చెవాకులే సమస్యను ఇంకా జఠిలం చేస్తున్నాయని ఒక నాయకుడు వాపోయాడు. మెల్లమెల్లగా ఉధృతమవుతున్న సమ్మె సకలజనుల సమ్మెగా మారనుందా అనే సందేహం అందరినీ పట్టిపీడిస్తోంది. అదే జరిగితే ఇక ఈ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని టిఆరెస్ వర్గాలు భయపడుతున్నాయి.

మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏమాత్రం బాగాలేవని ఢిల్లీలో టాక్. మొన్న కేసీఆర్ ప్రధానిని, హోంమంత్రిని కలిసినప్పడు కూడా వారు ముభావంగానే ఉన్నట్లు సమాచారం. ‘‘ఇక మీ వల్ల కాదు. మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండ’’ని అమిత్ షా కేసీఆర్ మొహం మీదే కుండ బద్దలు కొట్టాడని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వారు పూర్తిగా కేసీఆర్ మీదే దృష్టి సారించారనీ, దాని ఫలితమే మైహోమ్, మేఘాలపై ఐటీ దాడులని రాష్ట్ర బీజేపీ నాయకుల నిశ్చితాభిప్రాయం.

2024లో తిరగి టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశలు ఇప్పటికే అడుగంటిపోయాయని, అందుకే ఇప్పుడే కేటీఆర్ను సీఎం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం టిఆరెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దానివల్ల టీఆరెస్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుందనీ, అధికారం కూడా అందుకోవచ్చని వారి ఆశ. అది తప్పు కూడా కాదు. ఇప్పటికే తామరాకు మీద నీటిబొట్టులా ఉన్న హరీశ్రావు, రాజేందర్లు తప్పనిసరి అయినందునే తమను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, ప్రేమ, నమ్మకాలతో కాదని భావిస్తున్నట్లు వారి అనుయాయులు చెపుతున్నారు. కేటీఆర్ సీఎం అయితే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని, బావను ఎంతో ఇష్టపడే కేటీఆర్, ఆయనకు సముచితస్థానం కల్పిస్తాడని తాము ఆశాభావంతో ఉన్నట్లు హరీశ్ ఆంతరంగికురొకరు తెలిపారు.

ఏదేమైనా, 2020లో ఏదో ఒకటి జరుగుతుందని రాజకీయ విశ్లేషకుల నమ్మకం. పెనుసంచలనం నమోదవడం ఖాయమని ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు భావిస్తున్నాయి. హుజుర్నగర్ ఉపఎన్నిక, రాబోయే మున్సిపల్ ఎన్నికలు చాలా విషయాలను నిర్ణయించబోతున్నాయి.

– రుద్రప్రతాప్

Read more RELATED
Recommended to you

Latest news