తెలంగాణలో ఇక నుంచి డ్రగ్స్ తీసుకునే వారిపైనా కేసులు

-

మత్తుపదార్థాలు సేవించే వారిపైనా తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు.. డ్రగ్స్‌ సరఫరాదారులు, విక్రయదారులపైనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. ఇకపై డ్రగ్స్‌ వినియోగదారులపైనా కేసులు పెట్టనున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ప్రీతీష్‌ నారాయణన్‌ను నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు.

ప్రీతీశ్ నారాయణన్‌ తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా 6 వందల మందికి మత్తు పదార్ధాలు సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ఇందులో ఏపీ, తెలంగాణలకు చెందిన 174 మంది ఉండగా.. వారిపైనా కేసులు నమోదు చేశారు. వీరిలో 161 మందికి పోలీసులు సీఆర్​పీసీ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. వారి సమాధానం ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మత్తుపదార్ధాలు వినియోగిస్తున్న వారిపై.. రాష్ట్రంలో ఓకేసారి ఇంత పెద్దఎత్తున కేసులు నమోదు చేయటం ఇదే తొలిసారి.

ప్రీతేష్‌ నారాయణన్‌కు గోవా సముద్రతీరంలో పరిచయమైన మజూర్‌ అహ్మద్‌ ద్వారా ఎండీఎం, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌లాంటి మత్తు పదార్ధాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌ తెచ్చేవాడు. ఓ ముఠా ద్వారా డ్రగ్స్‌ను విక్రయించి వాటాలు పంచుకునేవారు. ప్రీతేష్‌ హైదరాబాద్‌లోని వాడకందారులతో వాట్సాప్‌ ద్వారా సంప్రదింపులు జరుపుతూ సరకు చేరవేసేవాడు. అతని ఫోన్‌లో లభించిన 161 మందిలో అధికశాతం ఐటీ నిపుణులు, విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ డ్రగ్స్‌ను వారే తీసుకుంటున్నారా? బయట వ్యక్తులకు విక్రయించారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news