టీఎస్​ఆర్టీసీ వీఆర్‌ఎస్‌కు ఉద్యోగుల నుంచి నో రెస్పాన్స్

-

టీఎస్​ఆర్టీసీ తీసుకొచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణకు ఉద్యోగుల నుంచి అంతంత మాత్రం స్పందనే లభిస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆసక్తికలిగిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్​ఆర్టీసీ జులై 25న ఉత్తర్వులు ఇచ్చింది. జులై 31 వరకు గడువు తేదీగా నిర్ణయించింది. ప్రతి డిపోలో రిజిస్టర్‌ ఏర్పాటుచేసి వివరాలు నమోదు చేసుకోవాలని డీఎంలకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది.

అయితే ఇందుకు అంతంత మాత్రం స్పందనే వచ్చింది. యాజమాన్య లెక్కల ప్రకారం 45,600మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 52 ఏళ్లు పైబడినవారు 21,680 మంది ఉన్నారు. వారిలో 34 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారు 16,540 మంది ఉన్నారు. జులై 25 నుంచి 30వరకు.. 522 మంది మాత్రమే వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నారు.

ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతలేకుండా వీఆర్​ఎస్​ ఉత్తర్వులిచ్చిందని కార్మిక సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ‘సంస్థకు నష్టాలు పెరుగుతుండటంతో బస్సులసంఖ్యను భారీగా కుదించారు. ఉద్యోగుల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. గతంలో ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితి నెలకొంది. డీఏ సైతం ఇంకా పెండింగులో ఉంది. అని వాపోతున్నారు.

ఇన్ని సమస్యలు ఉండగా స్వచ్ఛంద పదవీ విరమణ నిబంధనలను యాజమాన్యం తీసుకురావడాన్ని కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. సంస్థను నిర్వీర్యం చేయడంలో భాగంగా తెచ్చారని ఆరోపిస్తున్నారు.

ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే వీఆర్​ఎస్​ను తెచ్చామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. వాస్తవానికి ఈమార్చిలోనే వీఆర్​ఎస్​ తెరపైకి వచ్చినా.. ఆ తర్వాత ముందుకు తీసుకెళ్లలేదు. ఆనంతరం ఉతర్వులు జారీ చేసిన యాజమాన్యం.. 20 ఏళ్ల సర్వీస్‌ ఉండాలని, 48 ఏళ్ల వయస్సు ఉన్న సిబ్బంది అర్హులని తెలిపింది.

వీఆర్​ఎస్ అనంతరం చెల్లింపులు అస్పష్టంగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. పీఎఫ్‌ ద్వారా పింఛను ఆర్టీసీ ఇస్తున్నట్లు ప్రకటించడం సరైంది కాదంటున్నారు. వీఆర్​ఎస్​కు అంతంత మాత్రమే స్పందన లభించడంతో.. ఆర్టీసీ యాజమాన్యం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు మరికొన్ని రోజులు అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news