ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు.. ఆర్టీసీ బ‌స్సుల్లో విద్యార్థులకు ఫ్రీ జ‌ర్నీ

-

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జరగనునన్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 9:35 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే పరీక్షా హాలులోకి విద్యార్థుల‌ను అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ది ప‌రీక్ష‌ల హాల్ టికెట్ల‌ను ఇప్ప‌టికే ఆయా పాఠ‌శాల‌ల‌కు పంపించామ‌ని, వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని వెల్లడించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు త‌మ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించొచ్చ‌ని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర‌వుతార‌ని, 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.  ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.  పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news