తెలంగాణ రాష్ట్రాన్ని వరణుడు మరోసారి వణికించేందుకు సిద్ధమయ్యాడు. ఆగ్నేయ ద్వీపకల్ప దిక్కున శనివారం నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది.
రాష్ట్రంలో ఈ నెల 31, నవంబర్ 1న పలు చోట్ల వర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నవంబర్ 1న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
రాత్రి ఉష్ణోగ్రతలు 15 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదుకాగా, అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 12.5 డిగ్రీలు నమోదైనట్టు వివరించింది. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.