గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 317 జీవోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోతో తమ కుటుంబాలు చెల్లా చెదురు అవుతున్నాయని పేర్కొంటున్నారు ఉద్యోగులు. ప్రధానంగా ఉద్యోగులు వారి స్థానికత కోల్పోయి మూడు, నాలుగు జిల్లాలు దాటి పరాయి జిల్లాలో ఉద్యోగ జీవితం గడుపుతూ నా అన్నవాళ్లందరికీ దూరమై స్థానికతను, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సంతోషాన్ని కోల్పోయి బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నట్టు చెబుతున్నారు.
తాజాగా 317 జీవో బాధితులు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. జీవో 317ను రద్దు చేయాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసన చేపట్టారు. దీంతో గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ గాంధీ జయంతి కావడం.. గాంధీ భవన్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ జీవో వల్ల జరిగిన నష్టం గురించి తెలిపేందుకు దాదాపు 18 సార్లు ప్రగతి భవన్ ను ముట్టడించారు. 34 మంది జీవో 317 బాధితులు మరణించారు.