నిత్యం అందుబాటులో ఉన్నా ప్రజలు ఓడించారని.. లోపాలను సమీక్షించుకుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి హాజరై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పది సంవత్సరాల పాటు కేసీఆర్ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు మళ్లించారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవ్వరూ కష్టపడలేదు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలనే తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు.
ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ.. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారు. ఓరుగల్లు మన జయశంకర్ పుట్టిన నేల.. 2014, 2019 వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి కూడా వరంగల్ లో గులాబీ జెండా ఎగరాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి.. పార్లమెంట్ ఎన్నికలపై విజయం దిశగా పని చేద్దాం. కార్యకర్తల్లో ఉత్సాహం యధావిధిగా ఉంది. ఇదే చైతన్యంతో పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పని చేయాలి.