తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఆర్టీసీ షాక్

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఏపీ, టీఎస్ ఆర్టీసీలు షాక్ ఇచ్చాయి. ఏపీకి వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ నిలిపివేయగా, అడ్వాన్స్ బస్ టికెట్ రిజర్వేషన్లను ఏపీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. కాగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీలో బుధవారం నుంచి పగటి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. అలానే దుకాణాల వద్ద ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

పగటి పూట కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజా రవాణాపై కూడా ఏపీ సర్కార్ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. మే 18 వరకు ముందస్తు రిజర్వేషన్లను నిలిపేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పడు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అలానే మధ్యాహ్నం 12 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గమ్యస్థానాలు చేరుకునే సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.

ఇక ఏపీలో పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కూడా చర్యలు చేపట్టింది. ఏపీకి వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకే టీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఏపీ సర్వీసుల రిజర్వేషన్లను కూడా రద్దు చేసింది.ఏపీలో పగటి పూట కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. రామాపురం (కోదాడ), పొందుగుల (వాడపల్లి), నాగార్జునసాగర్ (మాచర్ల వైపు) మూడు చెక్ పోస్టులను మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.