తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్‌

-

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర నేడు పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలోనే భువనగిరి పట్టణంలోని జిట్టా బాలకృష్ణా రెడ్డి ఫామ్​హౌస్​లో బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

మునుగోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని ఉపఎన్నికలు రాబోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వంలో తమకు భవిష్యత్‌ ఉండదని భావించే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని.. ఈ విషయాన్ని సర్వేలు కూడా చెబుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం వచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో భాజపా 60-65 సీట్లు గెలవబోతున్నట్లు తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చేవారికి మాత్రం భాజపాలో స్థానం లేదన్నారు. టికెట్ల విషయంలో ఎవరికీ గ్యారంటీ లేదని.. ఆ విషయాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని.. క్యాసినో, ఇతర వ్యవహారాల్లో కుటుంబంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

నయీం ఆస్తుల కేసు విషయంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేపట్టాలన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత స్వాధీనం చేసుకున్న డైరీ, నగదు ఏమయ్యాయని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి రాగానే దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news