బీజేపీ అధికారంలోకి రాగానే జేపీఎస్ లందరినీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు బండి సంజయ్. న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగించేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
జూనియర్ కార్యదర్శులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదే. వారు చేస్తున్న సమ్మెకు బీజేపీ ఇప్పటికే సంఘీభావం ప్రకటించిందన్నారు. నేనడుగుతున్నా…. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేసిన తప్పేంది? పరీక్షలు రాసి పాసై ఉద్యోగాల్లో చేరి నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు. ఏ ఉద్యోగానికైనా ప్రొబేషనరీ పీరియడ్ ఏడాదో, రెండేళ్లో ఉంటుంది.
కానీ వీళ్లకు మాత్రం ప్రొబేషనరీ పీరియడ్ మూడేళ్లు పెట్టినా పనిచేశారని వెల్లడించారు. రెగ్యులరైజ్ చేయకుండా మళ్లీ మరో ఏడాది గడువు పెంచడం ఎంత వరకు సమంజసం? మనసులో ఎంత బాధ ఉన్నా భరిస్తూ రాత్రింబవళ్లు పనిచేస్తూ నాలుగేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేశారు. అయినప్పటికీ నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం. వీళ్లంటే కేసీఆర్ కు ఎందుకంత కక్ష? కేసీఆర్ కుటుంబానికి లంచాలు ఇవ్వలేదేమో.. పైసలిస్తే ఈపాటికే రెగ్యులరైజ్ చేసేవాళ్లేమోననే అనుమానం కలుగుతోందని చెప్పారు బండి సంజయ్.