కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా గత మూడు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తన భూమి పోతుందన్న భయంతో ఓ రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటివరకు కలెక్టర్ రైతులను కలవలేదు.
ఈ నేపథ్యంలో కామారెడ్డి రైతుల ఆందోళనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. రైతు రాజు ఆత్మహత్య తనని చాలా బాధకి గురి చేసిందన్నారు. రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. రైతులకు అండగా తాను ఉంటానని.. జిల్లా కలెక్టర్ ను కలిశానని చెప్పారు. ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోవద్దని సూచించిన కేఏ పాల్.. పది రోజులలో రైతులకు అనుకూలంగా ప్రకటన రాకపోతే తానే ధర్నాకు కూర్చుంటానని స్పష్టం చేశారు.