కేంద్ర ప్రభుత్వం ఒక్క పథకానికి కూడా సహకరించడం లేదన్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. కొత్తగూడెంలో నిర్వహించిన బిఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు ఒక చరిత్ర అన్నారు. నీళ్ళు లేని తెలంగాణలో ప్రణాళిక తో భూగర్భ జలాలు పెంచి సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు, ప్రజలకు చేయూత, ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. విద్య, వైద్యం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ఎంపీ నామా.
కేంద్రం ఒక్క పథకానికి సహకరించలేదని.. కేంద్ర నేతల మాయ మాటలు నమ్మొద్దన్నారు. పట్టణ, పల్లె ప్రగతి ద్వారా సమూల అభివృద్ధి, జాతీయ స్థాయి అవార్డులు, ఇది కేసీఆర్ సాధించిన ప్రగతి అని చెప్పుకొచ్చారు. ప్రతి నిత్యావసరాల మీద అధిక పన్నులు వేసి కేంద్రం సామాన్యుల పై పెనుభారం మోపిందని మండిపడ్డారు. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు ఎంపీ నామా నాగేశ్వరరావు.