కరోనా ఆర్ధిక నష్టం పై నేడు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష…!

-

కరోనాతో రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని ఇవాళ సమీక్షించనున్నారు… సీఎం కేసీఆర్‌. మధ్యాహ్నం రెండింటికి ప్రగతిభవన్‌లో 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష ఉంటుంది. సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఆర్థికశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. ఇక రేపు మంత్రులు, అన్ని శాఖల అధికారులతో మరోసారి సమావేశం కానున్నారు సీఎం.

 

కరోనా దెబ్బకు ఆర్థిక రంగం కుదేలవడంతో… పరిస్థితికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడైంది. ఎంత ఆదాయం వస్తుంది? వేటికి ఖర్చు పెట్టాలి? అనే అంశం పై దృష్టి పెట్టింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నివేదిక తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి లక్షా 82 వేల 914 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది… తెలంగాణ ప్రభుత్వం. భూముల అమ్మకంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావించింది. కానీ కరోనా రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద పిడుగే పడింది. ఆదాయం అమాంతం తగ్గిపోయింది. లాక్‌డౌన్ సడలింపులు మొదలయ్యాక ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు పడ్డా… అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వివిధ రంగాల నుంచి భారీగా ఆదాయం తగ్గిపోవడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సరిగ్గా రావడం లేదు. జీఎస్టీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ఆదాయం తగ్గితే ఆ మేరకు పరిహారం ఇస్తామని కేంద్రం జీఎస్టీ తెచ్చినప్పుడు ప్రకటించింది. ఇప్పుడు ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులూ అందడం లేదు… పరిహారమూ రావడం లేదు. అన్నీ కలిపి 10 వేల కోట్లు రావాల్సి ఉన్నా… కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దీంతో ఆదాయ వ్యయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం… ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news