దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలను ఆయన బలోపేతం చేశారని.. స్థానికసంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సచివాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతంపై రేవంత్ స్పందించారు.
బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా పొగరు తగ్గలేదు. సమూల మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి రాజీవ్‌గాంధీ నాంది పలికారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మారుస్తాం. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్‌ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుంది. సచివాలయం ముందు తాగుబోతులకు, దొంగలకు స్థానం లేదు. అంటూ బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.