ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు నెల మొత్తం బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలోనే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రోజునే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక ఇవాళ రాత్రి మళ్లీ ఆయన రాష్ట్రాన్ని దాటి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి ఆయన దిల్లీకి పయనమవుతున్నారు. శుక్రవారం రోజున దిల్లీలో రేపు దిల్లీలో ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఆ భేటీ తర్వాత పార్టీ అధిష్ఠానంతో సమావేశమవుతారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నూతన పీసీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అలాగే వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. తిరిగి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం రోజున మళ్లీ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.