ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతులకు మద్దతు ధర దక్కడమే గగనమైంది. దీంతో ఏటేటా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం పత్తి, మిర్చి పంటలకు రికార్డ్ ధరలు పలుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో పాటు దిగుబడి కూడా తక్కువ కావడంతో వ్యాపారులు రికార్డ్ ధరలు పెట్టి పంటలను కొనుగోలు చేస్తున్నారు. పంటలకు ధరలు పెరగడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది రైతులు తమ పంటలను తక్కువ ధరలకు అమ్మేసిన తర్వాత ధరలు పెరగడంతో నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే మరోసారి పత్తికి రికార్డ్ ధర పెరిగింది. ఏకంగా క్వింటాల్ పత్తి రూ. 14,000 రికార్డ్ ధర పలికింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో ఈ ధర లభించింది. గతంలో కూడా పత్తి ఇలాగే రికార్డ్ ధరలు పలికాయి. గతంలో జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డ్ ధర లభించింది. సాధారణంగా క్వింటాల్ పత్తికి రూ. 5000-6000 వరకు మాత్రమే ధర ఉంటుంది. అయితే ఈ సారి పంటల దిగుబడి తక్కువగా ఉండటం, మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి.