తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీలోగా ఎన్నికలు పూర్తై.. కొత్త సభ కొలువు తీరాలి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, అధికారులకు శిక్షణ సహా సంబంధిత అంశాలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను కూడా చేపట్టింది. రేపటిలోగా బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలనా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఆగస్టు రెండో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించి… దానిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి అక్టోబర్ నాలుగో తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించనున్నారు.
ఎన్నికల సన్నాహకాలు, కసరత్తు, ఏర్పాట్లను ఈసీ బృందం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సమీక్షించనుంది. ఇందుకోసం ఈసీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, పోలీస్ నోడల్ అధికారి, కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారితో ఈసీ బృందం సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడంతోపాటు ఎన్నికల నిర్వహణ, భద్రత సంబంధిత అంశాలపై చర్చిస్తారు.