పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు పోలీసులు. అయితే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉన్న నేపథ్యంలో 10వ తేదీన హాజరవుతానని చెప్పారు ఈటెల. ఈ నేపథ్యంలోనే నేడు విచారణకు హాజరయ్యారు ఈటల రాజేందర్. ఉదయం 12:50 గంటల నుండి 1:55 గంటల వరకు గంటపాటు ఈటెల రాజేందర్ ని విచారించారు పోలీస్ బృందం.
ఈటెల సెల్ ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ లని పరిశీలించారు. సెంట్రల్ డిసిపి కార్యాలయంలో డీసీపీ, ఏసిపి, కమలాపూర్ సిఐ నేతృత్వంలో ఈ విచారణ పూర్తయింది. పేపర్ వైరల్ వ్యవహారంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు ఈటెల. మళ్లీ తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించాలని సూచించారు విచారణ బృందం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బయట జై జై ఈటెల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయన అనుచరులు.