TSPSC పేపర్ లీక్ కేసు.. హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్​లో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కొందరు ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ప్రశ్నపత్రాలు కొన్నట్టు బహిర్గతమైంది. ఇందులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త ప్రమేయం ఉన్నట్టు నగర సిట్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తన కుమార్తె ఏఈఈ పరీక్ష కోసం హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌ సూత్రధారి ఏఈ రమేశ్‌ సహకారం తీసుకున్నట్టు నిర్ధారించారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలత భర్త శ్రీనివాస్‌కు ఏఈ రమేశ్‌తో పరిచయం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆయన కుమార్తె కోసం రమేశ్‌ను కలిశాడు. ఏఈఈ పరీక్షకు సహకరిస్తే రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగం వచ్చాకే డబ్బులిస్తానని షరతు విధించాడు. ఈ మేరకు ఫిబ్రవరి 26న శ్రీనివాస్‌ కూతురుతో పరీక్షను రాయించాడు. గుట్టుగా సాగిన వ్యవహారం బయటకు రాగానే మాజీ ఎంపీటీసీ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం.