కుల వృత్తుల వారికి లక్ష ఆర్థిక సాయం – సీఎం కేసీఆర్‌

-

కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎంబీసీ కులాలు కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వీరికి లక్ష రూపాయల చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి అమలు విధి విధానాలను మరోరెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ ఛైర్మన్, బిసి సంక్షేమశాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ సీఎంకు వివరించారు.

త్వరిత గతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం మంత్రి గంగులను ఆదేశించారు. సమీక్షా సమావేశం అనంతరం అమరుల స్మారకం వద్దకు సీఎం చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలిస్తూ కలియతిరిగారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు సీఎం పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ శ్రీ శశిధర్ ను సీఎం ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news