తెలంగాణ అమరవీరుల స్మారకం పనులను సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటికే మిగతా పనులన్నీ పూర్తయి, చివరి దశ సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో.. రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. అక్కడి నుంచి బీఆర్‌కే భవన్ వద్ద నిర్మించిన వంతెనలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ వంతెనలను నిర్మించారు.
మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, సీఎం కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.