సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అదనపు డీజీ సంజయ్ కుమార్ వెల్లడించారు. పొగ వల్లే ఎనిమిది మృతి చెందారని స్పష్టం చేశారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి కాస్త విషమంగా ఉందని.. మరికొందరు కోలుకుంటున్నారని తెలిపారు.
“రూబీప్రైడ్ భవనానికి 4 అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మరో అంతస్తు నిర్మించారు. సెల్లార్లో పార్కింగ్‌కు మాత్రమే అనుమతి. కానీ ఈ భవనంలో విద్యుత్తు వాహనాల విక్రయిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు స్ప్రింక్కర్లు పనిచేయలేదు. ఆ స్ప్రింకర్లు కేవలం మంటలు చెలరేగినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాయని.. నిన్నటి ఘటనలో దట్టమైన పొగ అలుముకోవడం వల్ల స్ప్రింకర్లు ఆన్ అవ్వలేదు. ఈ లాడ్జికి లోపలి, బయటికి వెళ్లడానికి ఒకే మార్గం ఉంది. దీనికారణంగా ప్రమాద సమయంలో ఎవరూ బయటికి రాలేకపోయారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీల నుంచి కిందకు దూకారు. ఈ సమయంలో కొందరు గాయపడ్డారు.” – సంజయ్ కుమార్, అగ్నిమాపక అదనపు డీజీ