అసదుద్దీన్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార గౌరీ, వినాయకుడు, ఇతర దేవీదేవతల విగ్రహాలకు హిందువులు రోజువారీగా పూజలు నిర్వహించుకునేలా ఆదేశించాలన్న హిందూ మహిళల పిటిషన్‌పై విచారణను కొనసాగించేందుకు జిల్లా కోర్టు సమ్మతించడం ఎంతో ఆనందదాయకమైన విషయం అని చెప్పారు.
దేశంలోని కోట్లాది హిందువులకు సంతోషం కలిగించే నిర్ణయమిది. అయితే ప్రాచీన ఆలయాలను హిందువులు మళ్లీ పునరుద్ధరించుకునే వీలు లేకుండా కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గారు ఇప్పుడు ప్రస్తావించడం అర్థరహితం. ఈ చట్టం ఉద్దేశాన్ని వారణాసి కోర్టు నిర్ణయం నీరుగారుస్తుందంటూ హైకోర్టులో అప్పీలు చేయాలనడం ఆయనకి ఎంత మాత్రం తగదన్నారు.
ఎందుకంటే, హిందువుల పిటిషన్‌పై విచారణ కొనసాగింపు వల్ల ముస్లింలకు వచ్చే నష్టం ఏమీలేదు. ఇక్కడ హిందువులు కోరుతోంది కేవలం నిత్య పూజలకి అవకాశం ఇమ్మని మాత్రమే. ఆ పిటిషన్ జ్ఞానవాపిలో ముస్లింల ప్రార్థనలను అభ్యంతర పెట్టడం లేదు. అందువల్ల ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి సమస్యా లేదు. హిందువులు అక్కడ పూజ చేసుకోవడానికి అవకాశం లభిస్తే ఈ పరిణామం ప్రత్యేకంగా ఎంఐఎం వంటి మతశక్తులకు తప్ప, ఇంకెవ్వరికీ సహజంగానైతే వ్యతిరేకమైనది కానందువల్ల, సామరస్య వాతావరణాన్ని కోరుకునేవారు ఎవరైనా వారణాసి కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టరని తెలిపారు విజయశాంతి.