భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

-

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం… ఇవాళ 41. 2 అడుగులు దాటింది. నిన్న సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

ఇవాళ ఉదయానికి 38 అడుగుల వద్దకు చేరగా…. మధ్యాహ్నానికి 41.2 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరిలోకి ఎగువ నుంచి 8,56,949 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో… స్నానఘట్టాల వద్దకు నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలంలో ఇంకా నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

మరోవైపు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూ అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news