ఆరు గ్యారెంటీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ కోట్ల కొద్ది అప్పులు చేశారని ఆరోపించారు. నేడు అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ.. ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే సంక్షేమ పతకాలను అమలు చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించేలా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశామని తెలిపారు. రూ.500లకే సిలిండర్ అందజేస్తున్నామని వెల్లడించారు జగ్గారెడ్డి. ఒకే దఫాలో రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేసిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందజేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారి దొంగ మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.