తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్. మార్చి 15 నుంచి బడులు ఒంటిపూట నడవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట నడవనున్నా.. ఇప్పటివరకు విద్యాశాఖ దానిపై ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రతి విద్యా సంవత్సరం మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నాయి.
అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ఒంటిపూట బడుల నేపథ్యంలో ఎలా జరపాలన్న సందిగ్ధత ఉపాధ్యాయుల్లో నెలకొని ఉంది. దానిపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం కూడా ఇస్తున్నందున విద్యాశాఖ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.