కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావాణి తుస్సుమన్నదని సెటైర్ వేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావాణిలో రోజూ సీఎం స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. మొదటి రోజు తరువాత సీఎం మొహం చాటేశారని విమర్శించారు. ప్రజావాణికి రోజుకొక మంత్రి వెళ్తారన్నారు.. అదీ లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని వెల్లడించారు. ప్రజావాణి గురించి గర్నవర్‌తో అర్థసత్యాలు చెప్పించారన్నారు.
ఆరు గ్యారంటీల్లో 13 హామీలున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో మూడు చెప్పి ఒక గ్యారంటీ అమలుచేశామని చెబుతారా అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అమలు లోపభూయిష్టంగా ఉన్నందునే గవర్నర్ ప్రసంగంలో చెప్పించలేదన్నారు. నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. డిసెంబర్ 9న అధికారంలోకి వస్తాం, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. అయితే ప్రమాణ స్వీకారాన్ని ముందుకు జరిపి.. హామీల అమలును వాయిదా వేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.