ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన దస్త్రాలపై ప్రభుత్వంపై ఫోకస్ పెట్టింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన బాలకృష్ణ.. ఆరు నెలల క్రితమే రెరాకు బదిలీ అయ్యారు. భూ మార్పులు, పంచాయితీల్లో తన అధికారాన్ని ఉపయోగించుకొని కోట్లు కూడబెటినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్దఎత్తున భూవినియోగ మార్పిడి ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏలో, పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినా ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై దస్త్రాలను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం. తాజా సోదాల నేపథ్యంలో శివబాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్‌పైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.