తెలంగాణ బిజెపి నేతలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి అరవింద్ కి వై కేటగిరి భద్రత కేటాయించగా.. ఈటెల రాజేందర్ కి వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. భద్రతతో పాటు ఈ ఇద్దరు నాయకులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది.
అయితే ఈ విషయంపై తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భద్రతను కోరలేదని తెలిపారు. అయితే తనపై గతంలో జరిగిన దాడి ఘటనలను పరిగణలోకి తీసుకొని అధికారులు తన ఇంటికి వచ్చి సమీక్షించారని తెలిపారు. అన్ని వివరాలను వారికి చెప్పానని.. ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారనేది మాత్రం ఇంకా స్పష్టంగా తనకి తెలియదని చెప్పారు.