సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఓట్ల కోసం కొత్త పథకాలకు తెరలేపుతున్నాడని ఆరోపించారు. దొర చెప్పేది బారాణ అయితే.. ఇచ్చేది చరణ మందం కూడా ఉండదని దుయ్యబట్టారు.
“ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడు! జిమ్మిక్కులు బయటపెడుతున్నాడు! ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నాడు! ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట.. బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట.
దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు. 13 లక్షల డబుల్ బెడ్ రూం దరఖాస్తులకు 30 వేలు కూడా ఇయ్యలేనోడు.. ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గానికి 3 వేల మందికి మూడు లక్షల చొప్పున ఇస్తాడట. గతంలో 15 రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ దొర, ఇప్పుడు ముందు రూ.లక్ష, ఎన్నికల్లో గెలిస్తే రూ.లక్ష అంటూ తిరకాసు పెడుతున్నాడు.
ఇండ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను దగా చేసే పనిలో పడ్డాడు. గెలిచిన 9 ఏళ్లలో ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇయ్యని కేసీఆర్.. ఎన్నికల ముందు పోడు పట్టాలు ముందటేసుకుండు. పోడు భూములు 13.18 లక్షల ఎకరాలు ఉంటే 4.01లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చి, చేతులు దులుపుకొని, ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ముందు కొన్ని ఇచ్చి, మిగతావి ఎన్నికల తర్వాత ఇస్తానని మభ్య పెట్టడానికా? తొమ్మిదేండ్లుగా బీసీలను నిండా ముంచిన దొర.. మళ్లీ బీసీల ఓట్లు అడిగితే గుంజి కొడతారని.. బీసీ కుల వృత్తులకు లక్ష పేరిట ఓట్లను కొనే పథకాన్ని ప్రవేశపెట్టాడు.
9 ఏళ్లుగా 4.77 లక్షల బీసీ లోన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు కానీ.. ఇప్పుడు నియోజకవర్గానికి 2 వేల మందికి లక్ష రూపాయలు ఇస్తాడట. ఒక్కో నియోజకవర్గానికి 50 వేల బీసీ కుటుంబాలుంటే 2 వేల మందికే ఇవ్వడాన్ని మోసం కాక మరేమంటారు? అందుకే ఎన్నికలు ఉంటేనే దొర బయటకు వస్తాడు. పథకాల పేరుతో వంచిస్తాడు. ప్రజలను బురిడీ కొట్టిస్తాడు. అర చేతిలో వైకుంఠం చూపిస్తాడు.
పదో పరకో ఇచ్చి ఉద్దరించినట్లు మాటలు చెప్తాడు. తీరా ఓట్లు పడ్డాక.. ప్రజలకు పంగనామాలు పెడతాడు. గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్ధానాలు సంగతేంది దొరా? రుణమాఫీకి దిక్కు లేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి లేదు. దళితులకు మూడెకరాల భూమి లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉచిత ఎరువులు పత్తా లేవు. ఈసారి మళ్ళీ కేసీఆర్ పథకాలను, మాటలను నమ్మితే మిగిలేది గుండు సున్నానే” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.