గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అసలు ఏపిలోనే జనసేన అంతంతమాత్రంగా ఉంది అనుకుంటున్న సమయంలో, అసలు ఏ ధైర్యంతో పవన్ ఈ నిర్ణయానికి వచ్చారు అనేది కనీసం జన సైనికులకు సైతం అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా పవన్ కు గ్రేటర్ పరిధిలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వారి అండదండలతోనే పవన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుదాము అని చూస్తున్నా , పార్టీ పరంగా చూస్తే జనసేన పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయినా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పవన్ ప్రకటించడం సంచలనంగా మారడమే కాకుండా, అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఎందుకంటే పవన్ స్పష్టంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ప్రకటించలేదు. అభిమానులు, పార్టీ నాయకుల కోరిక మేరకే జనసేన ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగుతుంది అంటూ పవన్ ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తే ,పవన్ బిజెపి కోసమే ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు అర్థమైపోతోంది. అధికార పార్టీ టిఆర్ఎస్ కు బలం తగ్గించేందుకు ,ఆ పార్టీ బలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు అనే అనుమానాలు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి మొదలయ్యాయ. ఈ తరహా రాజకీయాలు చేయడం బిజెపికి కొత్తేమీ కాదు. ఎందుకంటే బీహార్ లో ఎల్ జేపీ ని పావుగా ఉపయోగించుకున్న బీజేపీ, ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తుంది అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
అది కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత ప్రచారానికి, నామినేషన్ వేయడనికి గడువు అతి తక్కువ వ్యవధి ఉన్న సమయంలో పవన్ ఈ ప్రకటన చేయడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. అదీ కాకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కొన్ని సీట్లను గెలుచుకున్న తరువాత, ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ప్రకటించలేదు. అసలు జనసేన, బిజెపి పార్టీలు విడివిడిగా పోటీకి దిగుతున్నట్లు, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లే విధంగానే కనిపిస్తున్నారు. ఈ ఈ విధంగా లోపాయికారిక పొత్తు పెట్టుకునే విధంగా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతుందా అనే అనుమానంలో టిఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతం పవన్ సినిమాలలో నటిస్తున్న ఈ పరిస్థితుల్లో, టిఆర్ఎస్ పార్టీ తో సున్నం పెట్టుకోవడం వల్ల ఆయన రాజకీయ, సినీరంగానికి ఇబ్బందులు ఏర్పడతాయి ఏమో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. ఆకస్మాత్తుగా పవన్ చేసిన ప్రకటన కెసిఆర్ ను సైతం విస్మయానికి సమయానికి గురి చేసినట్లు గా కనిపిస్తోంది.